కొంతమందికి నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు . కానీ కోడిగుడ్డు అంటే చాల ఇష్టంగా తింటారు. ఈ గుడ్డు తో రకరకాల వంటకాలు వండుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలా వండే కన్నా ఉల్లికారం వేసి ఓసారి కోడుగుడ్డు ఫ్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే తింటే ఆ రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. స్పైసీగా తినేవారు కారం అధికంగా వేసి చేసుకుంటే రుచి అదిరిపోతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ఉల్లికారంతో కోడి గుడ్డు ఫ్రై ఎలా చేయాలో చూడండి .
ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు రెసిపీ:
గుడ్లు - నాలుగు
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
గరం మసాలా - పావు స్పూను
పసుపు - పావు స్పూను
కరివేపాకులు - గుప్పెడు
ఉల్లిపాయలు - మూడు
వెల్లుల్లి రెబ్బలు - ఏడు
కారం - మూడు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - అర స్పూను
నూనె - తగినంత
ఉల్లికారం కోడిగుడ్డు కర్రీ తయారీ విధానం :
1.ముందుగా కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2.తర్వాత ఉల్లిపాయలు కోసి మిక్సీలో వేయాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు కూడా వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకులు వేసి వేయించాలి.
4. ఈ రెండు వేగాక మిక్సీలో రుబ్బుకున్న ఉల్లిపాయ కారాన్ని వేసి వేయించుకోవాలి.
5. నూనె పైకి తేలే వరకు ఉడికించాలి . ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి వేయించుకోవాలి.
6. ఇప్పుడు కోడిగుడ్లకు చిన్న గాట్లు పెట్టి ఈ మిశ్రమంలో వేయాలి.
7. మంటను తగ్గించి పైన మూత పెట్టి పావుగంట సేపు ఉడకనివ్వాలి.
8. మధ్య మధ్యలో కూర కలుపుతూ ఉండాలి. చిన్న మంట మీద ఉడికిస్తే ఈ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది.
9.చివరగా పైన కొత్తిమీర తరుగు జల్లుకొని స్టవ్ కట్టేయాలి. అంతే ఉల్లికారంతో చేసిన కోడిగుడ్డు వేపుడు రుచి అదిరిపోతుంది.
10. ఇది ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా పప్పు వండుకున్నప్పుడు లేదా సాంబార్ వండుకున్నప్పుడు సైడ్ డిష్ గా ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు చేసుకుంటే రుచి అదిరిపోతుంది. దీనిలో మంచి ప్రోటీన్ ఉన్న ఐటమ్స్ ఉన్నాయి . కాబట్టి దీన్ని తినడం వల్ల అన్ని రకాలగా మంచే జరుగుతుంది.
ఈ కోడిగుడ్డులో మన శరీరానికి అవసరమైన ఐరన్, జింక్, విటమిన్ ఇ, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. గుడ్డులో ఉండే ప్రోటీన్లు మన శరీరానికి చాలా అవసరమైనది. ప్రతి రోజు ఒక కోడిగుడ్డు తినమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడానికి గుడ్లను తినాల్సిందే. ముఖ్యంగా అల్పాహారంలో కోడి గుడ్డును తినడం వల్ల బరువు పెరిగే అవకాశాన్ని తగ్గించుకుంటారు. అలాగే మహిళలు కోడిగుడ్డులోని తెల్ల సొనను తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా అడ్డుకోవచ్చు. దీనిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. గర్భిణులు కచ్చితంగా తినాల్సిన వాటిలో కోడిగుడ్లు ఒకటి. కంటి ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.అందు వలన డైలీ కోడిగుడ్లను తినడం వలన మనకు కావలసిన పోషకాలు లభిస్తాయి .